ఫొటో సోర్స్, @aaryavirsehwag

ఆర్యవీర్ సెహ్వాగ్‌. ఈ పేరు వినగానే ముందుగా గుర్చొచ్చేది ఆయన తండ్రి, భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే. కానీ అండర్ 19 ఆసియాకప్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ చేసిన సెంచరీ అతని గుర్తింపును కొత్తగా రాయడం మొదలుపెట్టింది.

ఒమన్‌లో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై నవంబర్ 10, 2026న ఆర్యవీర్ సెహ్వాగ్ 168 బంతుల్లో 160 పరుగులు చేశాడు.

అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి.

ఆర్యవీర్‌ ఆటతీరు కారణంగా అండర్ 19 భారత్ జట్టు యుఏఈపై 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే, ఆర్యవీర్ ఈ ఇన్నింగ్స్ ఆడే స్థాయికి చేరుకున్న ప్రయాణం కేవలం భారీ స్కోర్లతో కొలవలేనిది.

బాల్యంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడిన సంగతులు, దిల్లీ జట్టు ట్రయల్స్‌లో పాల్గొన్న సందర్భాలు, 297 పరుగులు చేసినా ఆశించినంత సంతృప్తి లేకపోవడం, మంచి ఆరంభం లభించినప్పటికీ తప్పుడు షాట్ ఆడి వికెట్ కోల్పోయి నిరాశ చెందడం వంటి ఎన్నో కథలు ఆర్యవీర్ ప్రయాణంలో ఉన్నాయి.

అప్పుడప్పుడు మైదానంలో తన తండ్రి ఆటను చూడటానికి బయల్దేరినప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుపోయి సరైన సమయానికి చేరుకోలేకపోయేవాడు.

కొన్నిసార్లు మ్యాచ్‌కు ముందు రోజు తన కోచ్ రూమ్‌కు పిలిచి పెద్ద ఇన్నింగ్స్ ఎలా ఆడాలో వివరించేవాడు. ఇప్పుడు ఒమన్‌లో ఆర్యవీర్ 160 పరుగులు చేయడంతో వార్తల్లో నిలిచాడు.

End of ఎక్కువమంది చదివినవి

ఫొటో సోర్స్, Santosh Harhare/Hindustan Times via Getty Images

తండ్రి ఇన్నింగ్స్‌ను చూడలేకపోయిన ఆర్యవీర్

ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు, ఆ ఆటను చూస్తూ ఆర్యవీర్ సెహ్వాగ్ పెరిగాడు.

కుటుంబమంతా భారీగా ఉన్న ట్రాఫిక్‌‌ను దాటి స్టేడియానికి వెళ్లేసరికి సెహ్వాగ్ అవుటైపోయేవాడు.

ఆర్యవీర్ ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పంచుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.

తండ్రి ఆట చూసిన తర్వాత తనకు, తన సోదరుడికి క్రికెట్‌పై మక్కువ పెరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ ప్లాస్టిక్ బ్యాట్, బాల్‌తో గంటలతరబడి ఆడేవాళ్లమని చెప్పాడు.

ఆర్యవీర్ పేరు దిల్లీ అండర్-16 జట్టు ట్రయల్స్‌ జాబితాలో డిసెంబర్ 2021 నాటికి కనిపించింది. అప్పటికి అతని వయసు 14 ఏళ్లు.

విజయ్ మర్చంట్ ట్రోఫీకి సంబంధించిన తొలి దశ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు దిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియానికి ఆర్యవీర్‌‌కు అవకాశమిస్తూ దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ జాబితాలో ఆర్యవీర్‌ పేరు ఎదురుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నారు.

తదుపరి ఏడాది విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడే దిల్లీ అండర్- 16 టీమ్‌లో ఆర్యవీర్ చోటు దక్కించుకున్నాడు.

వినూ మన్కడ్ ట్రోఫీలో అక్టోబర్ 2024న ఆర్యవీర్ సెహ్వాగ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో మణిపూర్‌పై 49 పరుగులు చేశాడు.

End of content

297 పరుగులు... అయినా అసంతృప్తే

కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా 2024 నవంబర్‌లో షిల్లాంగ్ వేదికగా దిల్లీ, మేఘాలయ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

దిల్లీ అండర్ -19 జట్టు తరఫున ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆర్యవీర్ సెహ్వాగ్ మొదటి రోజంతా ఆడి 200 పరుగులు చేశాడు. తర్వాత రోజు కూడా ఆడి 309 బంతుల్లో 297 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్ చూసి కుమారుడిని అభినందించిన సెహ్వాగ్ 23 పరుగుల తేడాలో ఫెరారీ కారు మిస్ అయ్యావని రాసుకొచ్చినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

ఇది చాలా సంవత్సరాల క్రితం నాటి విషయం.

టెస్టు క్రికెట్‌లో తాను చేసిన 319 పరుగులను తన పిల్లలు అధిగమించి పరుగులు చేస్తే ఫెరారీ కారు కొనిస్తానని 2015లో క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లేతో వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.

ఆ స్కోరుకు 23 పరుగుల దూరంలో ఆర్యవీర్ ఆగిపోయాడు.

దిల్లీ అండర్ -19 కోచ్ యోగేశ్ నాగర్ మాత్రం ఆర్యవీర్ సెహ్వాగ్ మొహంలో నిరాశను గమనించాడు. మూడు పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ కోల్పోయాననే బాధ ఆర్యవీర్‌లో కనిపించిందని యోగేశ్ నాగర్ అన్నారు.

వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో యోగేశ్ నాగర్ ఐపీఎల్ ఆడాడు. ఇప్పుడు ఆర్యవీర్ బ్యాటింగ్‌ను కూడా చాలా దగ్గర పరిశీలిస్తున్నాడు.

ఆర్యవీర్‌ బ్యాక్‌ఫుట్‌లో షాట్స్ ఆడుతున్నప్పుడు తన తండ్రిని గుర్తుకు తెస్తున్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ నాగర్ చెప్పారు. ఆర్యవీర్ ఆడే కట్‌ షాట్స్ చూస్తే కూడా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చారని దిల్లీ అండర్ -19 మాజీ కోచ్ జశ్వంత్ రాయ్ చెప్పారు.

'బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడు'

ఆర్యవీర్ సెహ్వాగ్ 2025 ఆగస్టులో సెంట్రల్ దిల్లీ కింగ్స్ తరఫున దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు.

ఈస్ట్ దిల్లీ రైడర్స్‌లో ఆడుతున్నప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ బౌలింగ్ చేస్తున్నాడు.

ఆర్యవీర్ 16 బంతుల్లో 22 పరుగులతో ఆడాడు.

ఆ మ్యాచ్‌ కోసం మైదానంలోకి అడుగు పెట్టినప్పటికి చాలా ఆందోళన, ఒత్తిడి కలిగిందని, అయితే బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడాలనే తన తండ్రి సూచనను పదే పదే గుర్తు చేసుకున్నట్టు ఇండియా టుడేకు చెప్పారు.

కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఔటైన బంతిని గురించే ఆలోచించాడు.

అప్పటికే ఆ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టాను, మరో భారీ షాట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆర్యవీర్ అన్నాడు.

ఒక పరుగు చేసి అవతలి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాల్సింది.

తర్వాత సెషన్‌లో ఆర్యవీర్ వెస్ట్ దిల్లీ లైన్స్ తరఫున ఆడాడు

ఆ జట్టులో అనుభవం ఉన్న ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నందున ఆర్యవీర్‌కు సరైన అవకాశాలు రాలేదని ఆ టీమ్ మెంటార్ ఉదయ్ గుప్తా చెప్పారు.

కానీ, తన వంతు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కూడా నెట్స్‌లో చాలా శ్రమించేవాడని అన్నారు.

మూడు మంచి ఆరంభాలు

భారత్ అండర్ -19 తరఫున ఆర్యవీర్ సెహ్వాగ్ సెప్టెంబర్ 2026లో ఆస్ట్రేలియాపై రాజ్‌కోట్‌లో మూడు వన్డేలు ఆడాడు.

ఈ టోర్నీలో ఆర్యవీర్ 28, 47, 34 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లలో ఆర్యవీర్‌కు మంచి ఆరంభమే లభించింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతను హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.

రెండో మ్యాచ్‌లో రన్ అవుట్ రూపంలో వెనుదిరిగితే, మూడో వన్డేలో సిక్స్‌ కోసం ప్రయత్నించి అవుటయ్యాడు.

ఆఖరి మ్యాచ్‌లో తాను అవుటైన తీరు చాలా అసంతృప్తి కలిగించిందని ఆర్యవీర్ అన్నట్టు బీసీసీఐ ఒక ఇంటర్వ్యూ ప్రచురించింది.

ఆ సిరీస్ నుంచి అతను మరో పాఠం నేర్చుకున్నాడు.

"ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలి అంటే దాన్ని భాగాలుగా విభజించుకోవాలి. ఎప్పుడు వేగంగా పరుగులు సాధించాలి, ఎప్పుడు ఓపికతో ఆడాలి అనే విషయాన్ని బ్యాట్స్‌మన్ అర్థం చేసుకోవాలి" అని ఆర్యవీర్ అన్నాడు.

మ్యాచ్‌కు ముందు కోచ్ సలహాలు

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత, ఆర్యవీర్ మళ్లీ దిల్లీ జట్టులో చేరి వినూ మన్కడ్ ట్రోఫీలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

ఛత్తీస్‌గఢ్‌ మ్యాచ్‌కు ముందు దిల్లీ కోచ్ రాజీవ్ నాయర్ తన రూమ్‌కు ఆర్యవీర్‌ను పిలిచారు.

అంతకు ముందు మ్యాచ్‌లో ఆర్యవీర్ 40 పరుగుల వద్దకు చేరుకున్న తర్వాత గాల్లోకి షాట్స్ ఆడుతూ వికెట్ కోల్పోయిన విషయాన్ని నాయర్ గుర్తించారు.

ముందు పిచ్‌ను బౌలర్‌ను అర్థం చేసుకోవాలని ఆర్యవీర్‌కు సూచించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు నాయర్ చెప్పారు.

ఒక మంచి ఆరంభం లభించిన తర్వాత వికెట్ కోల్పోకూడదని ఆయన చెప్పారు. ఒకసారి బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో కుదురుకుంటే, తనకు నచ్చిన షాట్లు ఆడేందుకు అవకాశం లభిస్తుందని కూడా వివరించారు.

ఆ తర్వాత రోజు అక్టోబర్ 16న జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ 143 బంతుల్లో 173 పరుగులు చేశాడు.

ఆ మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోయింది. అయితే, ఆ రోజు ఆర్యవీర్ తన స్కోరు పట్ల పూర్తిగా సంతృప్తి చెందలేదని నాయర్‌కు గుర్తుంది. ఆ సమయంలో, తాను డబుల్ సెంచరీ చేయలేదని బాధపడ్డాడని చెప్పాడు.

ఆర్యవీర్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, కెప్టెన్సీని నాయర్ ప్రశంసించారు.

అయితే, భారత సీనియర్ జట్టులోకి చేరడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన చెబుతున్నారు. అలా జరగాలంటే, ఆర్యవీర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంటుంది.

160 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏం మారింది?

అండర్-19 ఆసియా కప్‌లో, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ 52 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.

ఆ తర్వాత ఆర్యవీర్, వి.కె. వినీత్‌తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై రెండో వికెట్‌కు 193 పరుగులు జోడించాడు. భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

ఆర్యవీర్‌ 160 పరుగుల ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది.

అతను ఎదుర్కొన్న మొదటి 13 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. 14వ బంతిని బౌండరీకి తరలించి ఖాతా తెరిచాడు.

సెంచరీ పూర్తి చేయడానికి 131 బంతులు తీసుకున్నాడు, ఆ తర్వాత కేవలం 37 బంతుల్లోనే మరో 60 పరుగులు సాధించాడు.

ఈ ఇన్నింగ్స్ వేగం ఎలా మారిందో చెప్పడానికి 38వ ఓవర్ ఒక చక్కని ఉదాహరణ. ఆర్యవీర్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఆర్యవీర్ సెప్టెంబర్‌లో చెప్పినట్టుగా 'ఒక భారీ ఇన్నింగ్స్‌కు ఉండాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు' ఒమన్‌లో కనిపించాయి.

మొదట, క్రీజులో కుదురుకుని పరుగులు వచ్చే వరకు ఓపికగా వేచి చూశాడు. ఆపై, సరైన అవకాశం దొరికినప్పుడు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

ఈ ఇన్నింగ్స్ ఆర్యవీర్‌ను భారత సీనియర్ జట్టులోకి చేర్చడానికి సరిపోతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. దీని కోసం నిలకడైన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది.

ఏది ఏమైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అతను కేవలం వీరేందర్ సెహ్వాగ్ కుమారుడిగా మాత్రమే కాకుండా, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఒక యువ క్రికెటర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

డేవిడ్ వార్నర్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఖవాజా చెప్పింది వంద శాతం నిజం

‘బంతి ఆకారాన్ని మార్చడానికి శాండ్ పేపర్ ఉపయోగించిన విషయం టీమ్ మొత్తానికి తెలుసు’ - ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఖావాజా

మహమ్మద్ షమీ: టెస్ట్‌ జట్టులోకి వచ్చిన తేదీనే 'తెల్ల జెర్సీకి వీడ్కోలు'

పాకిస్తాన్ ప్రధానిపై ట్రోలింగ్- 'టాస్ గెలిచినా అభినందనలు చెబుతారేమో' అంటూ వ్యాఖ్యలు చేస్తున్న యూజర్లు

అభిషేక్ శర్మ తుపాన్ బ్యాటింగ్, న్యూజీలాండ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ.. 6 వికెట్లతో భారత్ గెలుపు

సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

ముఖ్యమైన కథనాలు

ఏకకాలంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది?

శ్రీలంక వ్యక్తిని సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ టూరిస్టు వీడియో వైరల్.. అసలేం జరిగింది?

ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని’ సెహ్వాగ్ ఎందుకన్నారు?

ఫీచర్లు

పాపులర్