ఫొటో సోర్స్, PA Media

అలీషా ఆడమ్స్ 2023 మేలో ఖాసీమ్ చౌధరీతో వీడియో కాల్‌లో సంభాషించారు. అప్పటికే బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్ఏ)లో పనిచేస్తున్న చౌధరి దాదాపు మూడునెలలుగా సిక్‌లీవులో ఉన్నారు.

దీంతో ఆయన తిరిగి డ్యూటీలో చేరడానికి వీలైన ప్రణాళికను అమలు చేయడానికి లైన్ మేనేజర్ అడమ్స్ ఈ కాల్ చేశారు.

కాల్ ప్రారంభంలో చౌధరి దగ్గుతూ, తాను ఎంత అనారోగ్యంతో ఉన్నానో చూపించేందుకు టిష్యూలను ఉపయోగిస్తూ కెమెరా ముందు కనిపించారు.

కానీ చౌధరి ముఖం పాలిపోయి ఉండటం ఆడమ్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.

ఆయన నుదిటిపై ఉన్న తెల్లటి పౌడర్ రాలిపోతున్నట్టుగా ఆమె గమనించారు.

"ఆయనకు చెమట పట్టడంతో మేకప్ చెరిగిపోతున్నట్లు కనిపించింది. నుదిటిపై, మెడ వద్ద మేకప్ పోయి అసలు చర్మవర్ణం కనిపించింది" అని ఆమె కోర్టులో చెప్పారు.

అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించేందుకు చౌధరి తెల్లటి మేకప్ వేసుకున్నారని ఆమె ఆరోపించారు.

అయితే ఆ ఆరోపణను చౌధరి కోర్టులో ఖండించారు.

End of ఎక్కువమంది చదివినవి

గుర్తించని మోసపూరిత వ్యవహారం

చౌధరీకి యూకే‌హెచ్‌ఎస్ఏ ఒక్కటే ఉద్యోగం కాదని ఆడమ్స్‌కు అప్పట్లో తెలియదు.

అదే నెలలో ఆయన మరో నాలుగు ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోనూ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నందుకు జీతం తీసుకుంటున్నారు. అవి పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల శాఖ వ్యాపార, వాణిజ్య శాఖ, ఆహార ప్రమాణాల సంస్థ, హోం ఆఫీస్‌.

వారానికి 183 గంటలు పనిచేసేలా ఆయనకు ఒప్పందాలు ఉన్నాయి. అంటే ఏడు రోజుల్లో ఉండే మొత్తం గంటల కంటే కూడా ఎక్కువ సమయం! ఇలా మోసపూరితంగా పన్ను చెల్లింపుదారుల సొమ్ములో 2,84,000 పౌండ్లకు పైగాసంపాదించారు.

మొత్తంగా 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఎనిమిది పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఆయన నిర్వహించారు. ఆ సమయంలో సాపేక్షంగా జూనియర్‌ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అయిన చౌధురీకి 3,50,000 పౌండ్ల (రూ. 4.39 కోట్లు) జీతం అందింది.

అలీషా అడమ్స్‌తో వీడియో కాల్ జరిగిన కొద్దికాలానికే, చౌధరి ఆ సమావేశంలో డీఈఎఫ్ఆర్ఏ ఈమెయిల్ ఖాతాను ఉపయోగించి లాగిన్ అయినట్లు ఆమె గుర్తించారు. దీనిపై ప్రశ్నించగా, అది సాంకేతిక లోపం వల్ల జరిగిందని చౌధరి చెప్పినట్లు కోర్టుకు తెలియజేశారు.

అయితే, "ఆయన అబద్ధం చెబుతున్నారని నేను నమ్మాను" అని అడమ్స్ కోర్టులో జ్యూరీకి తెలిపారు. అనంతరం ఆమె తన అనుమానాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయినప్పటికీ, చౌధరి వ్యవహారం వెంటనే బయటపడలేదు. ఆయన మరికొన్ని నెలల పాటు ఒకేసారి పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూనే ఉన్నారు.

చివరకు ప్రభుత్వ నేషనల్ ఫ్రాడ్ ఇనిషియేటివ్ సంస్థ ఈ అనుమానాస్పద మోసంపై డీఈఎఫ్ఆర్ఏకు సమాచారం ఇచ్చింది. దీంతో డీఈఎఫ్ఆర్ఏ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది.

2023 జూలైలో చౌధురీని అరెస్టు చేసి, ఆయనపై నేరారోపణలు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ విచారించారు. 2023 సెప్టెంబరులో ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు.

ఆయనపై నమోదైన తొమ్మిది మోసం కేసుల్లోనూ సోమవారం దోషిగా తేలారు. ఆయనకు సుదీర్ఘమైన జైలు శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

End of content

విచారణకు ఒంటరిగానే....

56 ఏళ్ల చౌధరి ప్రతిరోజూ కోర్టుకు ఒంటరిగానే వచ్చేవారు. ఆయనకు వివాహం అయినప్పటికీ, విచారణ సమయంలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరూ కోర్టుకు వచ్చినట్టు కనిపించలేదు.

తలకు ఒక ఊలు టోపీ ధరించి, చేతుల్లో రెండు ప్లాస్టిక్ సంచులు పట్టుకుని కోర్టు భవనంలోని కారిడార్‌లలో నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం తరచూ కనిపించేది.

సాక్షుల బోనులో నిలబడి ఉన్నప్పుడు, చౌధరి కొన్నిసార్లు గందరగోళంగా, ఏమి జరుగుతోందో అర్థం కాక తికమకపడుతున్న వ్యక్తిలా కనిపించేవాడు.

తనకు 2015లో పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని చౌధరి తెలిపారు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల జీవనోపాధి కోల్పోతాననే భయం తనలో బలంగా ఉండేదని, అందుకే ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు చేసినట్టు చెప్పారు. అలాగే, . 2013లో విద్యాశాఖలోని ఉద్యోగం నుంచి తనను బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు.

"ఒత్తిడి, మానసిక వేదన, గతంలో ఎదురైన గాయాలు, ఆ సమయంలో నన్ను ఆవరించిన భయాందోళనల కారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను" అని ఆయన చెప్పారు.

అయితే, ఆయన ప్రవర్తన ఉద్దేశపూర్వకమైనదని, కావాలనే నిజాయతీగా వ్యవహరించలేదని, వ్యవస్థలోని లోపాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని ప్రాసిక్యూషన్‌ వాదించింది.

ఫొటో సోర్స్, Elizabeth Cook/PA Media

తల్లి అనారోగ్యాన్ని వాడుకున్న ఖాసీమ్ చౌధరి

ఈ కేసు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ ముందు కీలక ప్రశ్నలను నిలిపింది. ఇంతకాలం ఆయన ఈ మోసాన్ని ఎలా కొనసాగించగలిగారు?

దీనికి ఒక కారణం ప్రభుత్వ ఉద్యోగుల మానవ వనరుల వ్యవస్థ కేంద్రీకృతంగా లేకపోవడం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసినప్పుడు తాను ఇప్పటికే మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉన్నాననే విషయాన్ని చౌధరీ వెల్లడించలేదు.

దీంతో ఒకే వ్యక్తి పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని వ్యవస్థ గుర్తించలేకపోయింది.

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గవర్నమెంట్‌లో పనిచేస్తున్న హన్నా కీనన్‌ మాట్లాడుతూ, ఈ వ్యవస్థ స్పష్టంగా విఫలమైందన్నారు.

"ప్రభుత్వ శాఖలు ఒకదానితో మరొకటి సమన్వయం లేకుండానే, స్వతంత్రంగా నియామక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వాటి మధ్య సమాచారాన్ని అనుసంధానించే వ్యవస్థలు లేవు" అని ఆమె చెప్పారు.

"ఈ విధానం, దాని చుట్టూ ఉన్న పని సంస్కృతి సరిగా పనిచేయడం లేదనేది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. పనితీరు సరిగా లేని ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారుతూ, ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారని చాలా కాలంగా మనకు తెలుసు" అని ఆమె పేర్కొన్నారు.

బ్రిటన్‌ ప్రభుత్వ సివిల్‌ సర్వీసులో 5.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సెంట్రల్‌ లండన్‌లోని వైట్‌హాల్‌ కార్యాలయాల్లో ఉంటారు. ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, దేశ రోజువారీ పరిపాలనను నిర్వహించడం వీరి బాధ్యత.

చౌధరి వ్యవహారం ఇంతకాలం బయటపడకుండా ఉండటానికి ముఖ్య కారణం, ఆయన పూర్తిగా ఇంటి నుంచే పని చేయడమే.

తూర్పు లండన్‌లో తన తల్లితో కలిసి నివసిస్తున్న ఇంటి నుంచే ఆయన అన్ని ఉద్యోగాలను నిర్వహించేవారు.

2023 నాటికి ఆయన తల్లి డిమెన్షియాతో పాటు చివరి దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమెను చూసుకోవడానికి తాను ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందని చౌధరి తన మేనేజర్లకు తెలిపారు.

ఈ కారణంతో ఆయనకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం లభించడంతో, ఒకేసారి పలు ఉద్యోగాలు నిర్వహిస్తున్న విషయం చాలా కాలం గుర్తించలేకపోయారు.

అయితే, తన తల్లి సంరక్షణపై దృష్టి పెట్టేందుకు ఉద్యోగాల సంఖ్యను తగ్గించుకోవడానికి బదులుగా, చౌధరి మరిన్ని ఉద్యోగాలు చేపట్టినట్లు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. అలాగే, ఒకేసారి ఇన్ని ఉద్యోగాల బాధ్యతలను నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితిని కప్పిపుచ్చేందుకు, తన కుటుంబ వైద్యుడు ఇచ్చిన అనారోగ్య ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించినట్లు ఆరోపిస్తోంది.

2023 ఏప్రిల్‌లో, "మిక్స్‌డ్ యాంగ్జైటీ అండ్ డిప్రెసివ్ డిజార్డర్" కారణంగా తాను పని చేయలేనని చెబుతూ, డీఈఎఫ్ఆర్ఏ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్, అలాగే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీలోని తన విధులకు హాజరుకాలేదని కోర్టు విచారణలో వెల్లడైంది.

ఈ అనారోగ్య ధ్రువపత్రాలను జ్యూరీకి చూపించినప్పటికీ, ఆ మానసిక సమస్యకు కారణమేంటన్న దానిపై లేదా ఆ సమయంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించారా అన్న దానిపై ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.

బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు

అనారోగ్య సెలవులో ఉన్నప్పటికీ, మరో ఉద్యోగంలో చేరేందుకు ఆయన వెనుకాడలేదు. ఈసారి హోం ఆఫీస్‌లో ఉద్యోగం చేపట్టారు. తాను అనారోగ్యంతో ఉన్నానని గానీ, మరోచోట పనిచేస్తున్నానని గానీ ఆ శాఖకు వెల్లడించలేదు.

ఆయనతో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులు విచారణ సందర్భంగా చెప్పిన విషయాలను బట్టి చూస్తే, చౌధరీ తన ఉద్యోగాల్లో పెద్దగా మంచి పనితీరు కనబరచలేదు

డెఫ్రాలో ఆయనకు మేనేజర్‌గా ఉన్న డాన్‌ మెక్‌కార్ట్నీ ఇచ్చిన సాక్ష్యం మరింత స్పష్టంగా ఉంది. "ఆయనకు ప్రతిసారీ ఏం చేయాలో దాదాపు నేనే చెప్పాల్సి వచ్చేది" అని ఆయన తెలిపారు. వీడియో కాల్స్‌లో నాలుగు నెలల పాటు చౌధరీ తన కెమెరాను ఆఫ్‌లో ఉంచేవారని, అందుకు సాంకేతిక సమస్యలే కారణమని చెప్పేవారని వివరించారు.

2023 సెప్టెంబరులో చౌధురీ బ్యాంకు ఖాతాల్లో 40,000 పౌండ్లకు పైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు, 45,000 పౌండ్ల విలువైన ప్రీమియం బాండ్లతో సహా గణనీయమైన పెట్టుబడులు కూడా ఆయనకు ఉన్నాయి.

"కాశిమ్ చౌధరి ప్రజాసేవకుడిగా తనపై ఉంచిన విశ్వాసాన్ని దుర్వినియోగం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బులో దాదాపు 2.85 లక్షల పౌండ్ల(దాదాపు రూ. 3కోట్ల 16 లక్షలకుపైగా)ను మోసపూరితంగా పొందారు. ఇప్పుడు తన చర్యలకు తగిన ఫలితాన్ని ఎదుర్కోబోతున్నారు" అని డెఫ్రా ప్రతినిధి అన్నారు.

'పాలిగమస్ వర్కింగ్' సమస్య

చౌధరి కేసు మరో విస్తృత సమస్యను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిని "పాలిగమస్ వర్కింగ్" అని పిలుస్తున్నారు. అంటే, యజమానులకు తెలియకుండా ఒకేసారి అనేక ఉద్యోగాలు నిర్వహించడం.

ఇంతేకాకుండా, యజమానులకు తెలియకుండా ఎలా బహుళ ఉద్యోగాలు చేయాలో సలహాలు ఇచ్చే వెబ్‌సైట్లు కూడా ఏర్పడ్డాయి. ఇంటి నుంచే పనిచేసే విధానం విస్తరించడంతో ఈ ధోరణి పెరిగినట్లు భావిస్తున్నారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ ఫ్రాడ్ ఇనిషియేటివ్ తాజా నివేదిక ప్రకారం, లండన్‌లోనే 23 "పాలిగమస్ వర్కింగ్" కేసులు గుర్తించారు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే దాదాపు 5 లక్షల పౌండ్ల అదనపు వేతన చెల్లింపులు వెలుగులోకి వచ్చాయి.

కుటుంబ వివాదం

మోసం కేసుతోపాటు, చౌధరి తన ముగ్గురు తోబుట్టువులతో మరో న్యాయ వివాదంలోనూ ఉన్నారు. తమ తల్లి అవసాన దశలో ఉన్న సమయంలో, 21 లక్షల పౌండ్ల విలువైన ఆమె ఇంటిలో సగం వాటాను తన పేరుపై రాయించుకునేందుకు ఒత్తిడి తెచ్చారని తోబుట్టువులు ఆరోపిస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలను చౌధరి ఖండిస్తున్నారు.

క్రిమినల్‌ కేసు విచారణ సందర్భంగా కొన్నిసార్లు చౌధురీకి అక్కడ జరుగుతున్నది అర్థం కానట్లు కనిపించారు. తాను అల్లుకున్న అబద్ధాల వలయానికి గతంలో ఎదురైన మానసిక గాయాలే కారణమని ఆయన పేర్కొన్నారు.

అయితే, జ్యూరీ కేవలం ఏడు గంటల్లోనే తీర్పు వెలువరించింది. వ్యక్తిగత లాభం కోసమే ఆయన ఈ మోసానికి పాల్పడ్డారని, పన్ను చెల్లింపుదారుల సొమ్ములో పదివేల పౌండ్లను దొంగిలించారని నిర్ధారించింది.

దీంతో చౌధరి ఇప్పుడు గణనీయమైన జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయా, ఆ దేశ మీడియా ఏం చెబుతోంది?

‘పిరికివాళ్లు’గా గుర్తించి సైనికులకు మరణశిక్ష విధించిన దేశం ఏదంటే...

‘బంగ్లాదేశ్ మురికి‌ వాడలను దిల్లీ నగరంగా ప్రచారం చేస్తున్న చైనా వ్లాగర్లు’: భారత్ అసంతృప్తి

'నెలకు దాదాపు రూ.70 లక్షలు': ట్రంప్ మోదీని పొగిడేందుకు లాబీయింగ్ సంస్థలకు భారత ప్రభుత్వం డబ్బులు చెల్లించిందా?

" సీటీ స్కానింగ్‌తో ఛేదించిన 400 ఏళ్ల నాటి తాళం కోడ్, 20 ఏళ్ల ప్రయత్నం తర్వాత వీడిన రహస్యం"

ఎన్విడియా అధిపతి జెన్సన్ హ్వాంగ్‌తో వివాహేతర బంధంలో ఉన్నట్లు చెబుతున్న మహిళ ఎవరు?

ముఖ్యమైన కథనాలు

ఏకకాలంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది?

శ్రీలంక వ్యక్తిని సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ టూరిస్టు వీడియో వైరల్.. అసలేం జరిగింది?

ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని’ సెహ్వాగ్ ఎందుకన్నారు?

ఫీచర్లు

పాపులర్